తెలంగాణలో ఉచిత బస్సు పథకం.. మహిళలకు రెండు శుభవార్తలు!

HTV News,  20-Feb-2026: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుక మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీ మహాలక్ష్మి పథకానికి రీయింబర్స్‌మెంట్‌ కోసం మొత్తం రూ.7,777 కోట్లను కోరింది. ఈ మేరకు మౌలిక వసతులకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనల్ని చేసింది. ఇటు మహాలక్ష్మి పథకానికి సంబంధించి స్మార్ట్ కార్డుల్ని మహిళలకు అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ కీలక ప్రతిపాదనలు చేసింది. మహాలక్ష్మి పథకంతోపాటుగా ప్రయాణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తరణకు నిధుల్ని కోరింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కోసం రిక్వెస్ట్ చేసింది. మొత్తం రూ.7,777 కోట్లను మహాలక్ష్మి పథకానికి రీయింబర్స్‌మెంట్‌ కింద కేటాయించాలని కోరింది.

2026-2027 ఆర్థిక సంవత్సరంలో 680 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని.. వీటి కోసం రూ.241.37 కోట్లు అవసరమని కూడా కోరింది. బస్టాండ్‌ల నిర్మాణం, కొత్త డిపోలు, రుణాల చెల్లింపుల కోసం రూ.855 కోట్లు కోరింది. మౌలిక వసతులకు సంబంధించి రూ.442.61 కోట్లు,.. ఆయా వర్గాలకు బస్‌పాస్‌లకు సంబంధించి రూ.358 కోట్లు ప్రతిపాదించింది. తెలంగాణ రవాణాశాఖ కూడా ప్రతిపాదనల్లో.. 2026-2027 ఆర్థిక సంవత్సరంలో రూ.7,519 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తామని తెలిపింది.

మరోవైపు మహిళా శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి మరో తీపికబురు చెప్పింది ప్రభుత్వం. త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పేరుతో జూన్‌ 2వ తేదీ నుంచి జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల కోసం రూ.75 కోట్లు కేటాయించింది. మహిళలు ఉచిత బస్పు ప్రయాణం కోసం ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు కాకుండా.. మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులు అందుబాటులోకి వస్తే.. వీటిని చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఆర్టీసీ ప్రతిపాదనల్లో కొత్త బస్సులతో పాటుగా, బస్టాండ్‌లు, డిపోలు కూడా ఉన్నాయి. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే మహాలక్ష్మి పథకానికి ఇబ్బందులు లేకుండా పోతాయి. .బస్సుల్లో రద్దీ తగ్గుతుంది. కొత్త డిపోలు, బస్టాండ్‌లు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయంటున్నారు ఆర్టీసీ అధికారులు. మరి ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *