ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ‘దురంధర్’ స్టెప్పులు.. భారత్‌కు అదిరిపోయే థాంక్యూ నోట్!

HTV News, 20-Feb-2026: రాజకీయ సంబంధాలు కేవలం సంతకాలతోనే కాదు.. సంస్కృతుల కలయికతోనూ బలపడతాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నిరూపించారు. భారత పర్యటన ముగించుకుని వెళ్తూ.. ఆయన వదిలిన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా దురంధర్‌లోని ఓ సాంగ్‌కు.. తాను భారత్‌లో పర్యటించిన వీడియోలను చేర్చి అద్భుతమైన వీడియోను వదిలారు. అందులో ఆయనకు భారత్ పట్ల ఉన్న అమితమైన ప్రేమ కనిపిస్తోంది.

దౌత్యపరమైన చర్చలు, వ్యూహాత్మక ఒప్పందాలు ఒక ఎత్తయితే.. భారతీయుల మనసు గెలుచుకోవడం మరో ఎత్తు. మన దేశానికి వచ్చిన ఎంతో మంది ఇతర దేశాల నేతలు మన మనసు గెలుచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అచ్చంగా అలాంటి ప్రయత్నమే చేసి.. అందరి మనసు గెలుచుకున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్. ముఖ్యంగా తన మూడు రోజుల భారత పర్యటనను అత్యంత వినూత్నంగా, ఒక సినీ ఫక్కీలో ముగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పర్యటనలోని మధుర జ్ఞాపకాలను ఒక వీడియోగా మలిచి.. దానికి మన బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన దురంధర్ సినిమాలోని ఓ పాటు మ్యూజిక్ ట్రాక్‌ను వేశారు. దీన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.. తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేసిన ఈ వీడియో 43 సెకన్ల నిడివి కల్గి ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఈ వీడియోకు నేపథ్యంగా హిందీ బ్లాక్ బస్టర్ సినిమా దురంధర్‌లోని “నా దే దిల్ పరదేశీ ను” అనే పాపులర్ సాంగ్‌ను ఉపయోగించారు. ఈ వీడియోలో మెక్రాన్ తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన భేటీలు, తనకు లభించిన ఘన స్వాగతం, ఆలయ సందర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను చూపించారు. అంతేకాకుండా ముంబయి వీధుల్లో ఆయన చేసిన జాగింగ్ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వీడియోతో పాటు “ధన్యవాదాలు భారత్” అంటూ ఆయన రాసిన నోట్ అందరినీ మరింతగా అలరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *