(ఎన్నికల ప్రత్యేక కథనం) ఆర్మూర్ లో ముక్కోణపు పోటీ..బరిలో నిలిచిన బలమైన అభ్యర్థులు..కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపిల మధ్యే పోరు..రసవత్తరంగా మారిన ఆర్మూర్ రాజకీయం.. …
ఆర్మూర్ నవంబర్ 26 (HTV న్యూస్) బ్యూరో: ఆర్మూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు ముక్కోనపు పోటీ జరుగుతోంది. కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్న చందంగా ముగ్గురి మధ్య పోరు కొనసాగుతోంది. మూడు పార్టీలకు చెందిన నాయకులు బలమైన అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఒకరిపై ఒకరు తక్కువేమీ కాకుండా అన్ని కోణాల్లో తమదైన శైలిలో ఆరోపణలు చేస్తూ ప్రచారం చేయడం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ మండలానికి చెందిన వ్యక్తి .అయితే స్థానికుడు అనే ముద్ర వేసుకొని ప్రచారం చేస్తున్నాడు. గత 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుండి పోటీ చేసి సుమారు 20 వేల ఓట్లను సాధించి ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ ప్రజల మధ్యలో ఉంటూ అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందాడు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేసిన వ్యక్తిగా మంచి పేరుంది. కాగా ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్ నుండి బరిలో నిలిచి తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నాడు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు.కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాల మేనిఫెస్టో పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. నియోజకవర్గంలో తనకున్న క్యాడర్ తో పాటు ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్లు, దళిత, బిసి వర్గాల మద్దతు కూడగట్టుకున్న నేనే గెలుస్తానని వినయ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందించడంలో ముందున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొంటున్నాడు. ఆర్మూర్ పట్టణంతోపాటు నియోజకవర్గంలో బైపాస్ రోడ్లు, సిసి రోడ్లు, సిద్దుల గుట్ట ఘాట్ రోడ్ 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ కార్యాలయం, రెండు కొత్త మండలాల ఏర్పాటు, వృద్ధాప్య వితంతు వికలాంగ ఒంటరి మహిళ బీడీ కార్మికులు తదితరులకు పింఛన్లు అందించినట్లు వివరిస్తున్నాడు.అలాగే అనారోగ్యంతో ఆపదలో ఉన్న వారికి కార్పొరేట్ వైద్యం చేయిస్తూ ప్రజల మధ్యలో ఉండి వారి యోగ క్షేమాలు చూసుకున్న తనని ప్రజలు ఆదరిస్తారని అంటున్నాడు. భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధిస్తానని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పైడి రాకేష్ రెడ్డి ఊహించని రైతులు రాజకీయ ప్రవేశం చేశాడు. బిజెపి నుండి టికెట్ దక్కించుకొని బరిలో నిలిచాడు. సుమారు 6 నెలల క్రితమే స్వగ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహించి నియోజకవర్గంలో గుర్తింపు పొందాడు. స్థానికుడు కావడం వల్ల తొందర్లోనే ప్రజలకు సుపరిచితుడు అయ్యాడు. దీనికి తోడు బిజెపి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్నతమైన పదవుల్లో ఉన్న వారి సన్నిహితం వల్ల మరో అడుగు ముందుకేశాడు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రత్యర్థులపై హెచ్చరికలతో కూడిన ఆరోపణలు చేయడం వల్ల ప్రజలు మరింత దగ్గరయ్యారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అధిష్టానం ప్రకటించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నాడు. అంతేకాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తల బలంతో పాటు తనకున్న ఆత్మ విశ్వాసంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నాడు. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకోవడంతో గెలిచే అవకాశాలు తనకే ఉన్నాయని రాకేష్ రెడ్డి ధీమాలో ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారిందని చర్చ జరుగుతోంది. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో డిసెంబర్ మూడవ తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి.

