HTV News 14-Aug-2025 International News, Donald Trump on Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాస్కా వేదికగా నిర్వహించనున్న సమావేశం అనంతరం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్, ముందుకురాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు ఇతర ఐరోపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నాటి భేటీ సజావుగా సాగితే, ఆ వెంటనే జెలెన్‌స్కీని కూడా కలుపుకొని మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.
‘పుతిన్ బుకాయింపులకు పాల్పడుతున్నారు’
మరోవైపు ట్రంప్‌తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన అంశంపై ప్రపంచ నేతలు ఏకతాటిపై ఉన్నారని చెప్పారు. పుతిన్ బుకాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మొత్తం ఉక్రెయిన్‌ను ఆక్రమించగలనని చూపించే ప్రయత్నంలో భాగంగా సరిహద్దుల్లో యుద్ధాన్ని విస్తరించేందుకు చూస్తున్నారుని దుయ్యబట్టారు అయితే ఆయన మమ్మల్ని తప్పుదోవ పట్టించలేరని, ఒకవేళ కాల్పుల విరమణకు మాస్కో అంగీకరించని పక్షంలో మరిన్ని ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. ఆంక్షల ప్రభావం లేనట్లు రష్యా నటిస్తున్నప్పటికీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అవి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. అదేవిధంగా యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో ట్రంప్ మాకు మద్దతుగా నిలిచారని తెలిపారు.. పుతిన్‌తో చర్చల అనంతరం తనతో మాట్లాడతానని చెప్పినట్లు వివరించారు. ఆయనతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో భేటీలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని అమెరికా కోరుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారని తెలిపారు. అలాస్కా సమావేశం అనంతరం పుతిన్, జెలెన్‌స్కీలతో కలిసి మరో సమావేశం కోసం ప్రయత్నిస్తానని చెప్పినట్లు తెలిపారు. ఐరోపా, ఉక్రెయిన్ భద్రతా ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని జర్మనీ ఛాన్సరల్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అభిప్రాయపడ్డారు. శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేయకపోతే ఐరోపా, అమెరికాలు కలిసి రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు.
