HTV News: National News – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. అయితే ప్రధాని పర్యటనకు ముందు.. బెంగళూరుకు చెందిన 5 ఏళ్ల చిన్నారి.. తాను ఎదుర్కొంటున్న సమస్యలను ఒక లేఖ రూపంలో ప్రధానికి రాసింది. అయితే ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరు నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలతోపాటు.. రోడ్ల దుస్థితి గురించి.. ఆ లేఖలో చిన్నారి ప్రధానికి ఏకరువు పెట్టింది. ఈ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఇక తన కుమార్తె ప్రధానికి రాసిన లేఖను.. ఆమె తండ్రి నెట్టింట పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. ఈ లేఖ చూసిన నెటిజన్లు.. ఆ చిన్నారి ధైర్యానికి, ఆలోచనకు ఫిదా అయి.. లైక్‌లు, షేర్లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బెంగళూరులో ఉండే అభిరూప్ ఛటర్జీ 5 ఏళ్ల కుమార్తె ఆర్య రాసిన ఆ లేఖను ఆన ఈ నెల 10వ తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటనకు వస్తున్నారని తెలిసి.. తన కుమార్తె ఆర్య.. బెంగళూరు నగర ట్రాఫిక్ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువచ్చేందుకు ఇదే సరైన సమయం అని భావించింది అంటూ ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ జీ.. బెంగళూరు నగరంలో చాలా ట్రాఫిక్ ఉంటోంది. తాను స్కూల్‌కు, ఆఫీసుకు వెళ్లేందుకు చాలా లేట్ అవుతోంది. రోడ్లు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. దయచేసి తమకు సహాయం చేయండి’ అంటూ ఆ లేఖలో ఆర్య పేర్కొంది. దీంతోపాటు అందులో తన పేరు, వయసు, అడ్రస్, తేదీని కూడా రాసింది. ఇక తన సంతకం పక్కనే ఒక పువ్వును, హార్ట్ సింబల్‌తోపాటు మరిన్ని బొమ్మలను కూడా గీసింది. ఇక ఆర్య ప్రధానికి రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు బాగా షేర్ చేస్తున్నారు. బెంగళూరులో నివసించే కోట్ల మంది నగరవాసుల కష్టాలను ఒక లేఖ రూపంలో ఆర్య ప్రధానికి తెలియజేసేలా చేసిందని ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు.. బెంగళూరు ట్రాఫిక్ నరకంలో నిత్యం అవస్థలు పడే టెకీలు.. ఆర్య రాసిన లేఖను లైక్, కామెంట్, షేర్ చేస్తున్నారు. బెంగళూరు రోడ్లు , ట్రాఫిక్ సమస్యపై 5 ఏళ్ల ఆర్య రాసిన లేఖ కేవలం బెంగళూరు వాసులను మాత్రమే కాకుండా దేశ ప్రజలను ఆలోచింపచేస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
